South India లో వున్న ఆసక్తి కలిగించే దర్శనీయ స్థలాలన్నీ ఒకే సారిగా చూచి రావాలనుకుంటే, కనీసం నెల రోజులు పడుతుంది. దీనికోసం ఒక మంచి tour plan ఉండాలి. పిల్లలు, ఆడవారు లేకుండా కేవలం మగవారు మాత్రమే వెళ్లినా, లేదూ త్వర త్వరగా తెమలగలిగే ఆడవారితో కలిసి వెళ్లి, ఎంత పరుగు లెత్తేటట్లు ప్రయాణం చేసినా కనీసం ఇరవై అయిదు రోజులకు తక్కువ పట్టదు. అన్ని రోజులపాటు ఒకేసారిగా వెసులుబాటు, అవకాశము కలిగి వుండేవారు ఈ రోజులలో చాలా అరుదు. అంతేగాక, ఒకేసారి అన్ని రోజులుపాటు ఎడతెగకుండా ప్రయాణంచెయ్యాలన్నా చాలాశ్రమ, ఎంతో విసుగుకూడాన్నూ. అందువల్ల South India మూడు లేక నాలుగు ముక్కలుగా చేసికొని, ఒక్కొక్క తడవ ఒక్కొక్క భాగానికి వెళ్లి రావడం హాయిగాను, అన్ని విధాలా అనుకూలంగాను ఉంటుంది.
కాగా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో, చూడదగ్గ స్థలాలు ఒకదానికొకటి చాలా దూర దూరంగా వుంటాయి. అందువలన ప్రయాణానికే చాల సమయం పడుతుంది. కాని, తమిళనాడులో ఒకటి రెండు ప్రదేశాలు మినహా మిగిలిన స్థలాలన్నీ దగ్గర దగ్గరగా వుంటాయి. ఒక చోటనుంచి మరొక చోటకు కేవలం రెండు లేక మూడు గంటలకు మించి పట్టదు. రైలు, బస్సు సౌకర్యాలు గూడా వెంట వెంటనే వుంటాయి. అందువల్ల కన్యాకుమారి నుండి మద్రాసు వరకు రైలులో రిజర్వేషను అవసరం లేకుండానే యాత్ర చేయవచ్చు.

కర్ణాటకలో చాలాప్రదేశాలకు రైలుసౌకర్యం లేదు. కేవలం బస్సు ప్రయాణం చేస్తూ వెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని దర్శనీయ స్థలాలు అన్ని వైపులకు విస్తరించి వున్నాయి. విజయవాడను కేంద్రంగా చేసికొంటే, తూర్పు వైపున వరసగా దాక్షారామం, కోటిపల్లి, ర్యాలి, అన్నవరం, సింహాచలం, అరకు, శ్రీకూర్మం, అరసవిల్లి వున్నాయి. ఉత్తర భాగంలో బాసర, హైద్రాబాదు, వేములవాడ, యాదగిరి గుట్ట, వరంగల్లు, భద్రాచలం వున్నాయి.
విజయవాడకు పడమరగా, అమరావతి మహానంది, శ్రీశైలం, మంత్రాలయం మొదలైనవి వున్నాయి.South India లో నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, లేపాక్షి మొదలైనవి వున్నాయి. ఇవన్నీ ఎవరికి వారు వారి వారి అనుకూలాన్ని బట్టి తడవకు ఒక వైపుగా వెళ్లి చూచి రావల్సిందే. అయితే, ఉత్తర కర్ణాటకలో వున్న హంపి, గోకర్ణం లేదా గోవా ప్రాంతాలకు వెళ్లేవారు, శ్రీశైలం, మంత్రాలయం చూచుకొని వెళ్లవచ్చు. అలాగే దక్షిణాది యాత్ర అంటే తమిళనాడు యాత్రలో భాగంగా తిరుపతి, శ్రీకాళహస్తి కలుపుకోవచ్చు.
నా అనుభవాన్ని బట్టి South Indiaలో ఆంధ్రప్రదేశ్ మాత్రం నాలుగు తడవలుగా చూడటం చాల అనుకూలంగా వుంటుంది.
1. శ్రీకూర్మం, అరసవిల్లి, అరకు, సింహాచలం, విశాఖపట్టణం, అన్నవరం, రాజమండ్రి, ద్రాక్షారామం, కోటిపల్లి, ర్యాలి, ఇవన్నీ మొదటి భాగం.
2. బాసర, హైద్రాబాదు, యాదగిరి గుట్ట, వరంగల్లు, వేములవాడ, రామప్పగుడి, భద్రాచలం
– ఇవి రెండవ భాగం
3. అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం – ఇది మూడవభాగం
4. నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం- ఇవి నాలుగవ భాగం. ఎవరి అనుకూలాన్ని బట్టి వారు ప్రణాళిక ఏర్పరుచుకోవాలి.
South India లో గోవా, కర్ణాటక యాత్ర ఉత్తరాన హంపితో మొదలు పెట్టి చివరన బెంగుళూరుతో ముగించుకొని రావచ్చు. మీ అనుకూలాన్ని బట్టి హంపి కంటె ముందు అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం చూచుకుని వెళ్లవచ్చు. అలాగే, బెంగుళూరు నుంచి వచ్చేటప్పుడు లేపాక్షి చూచి గుంతకల్లు మీదుగా వచ్చి వేయవచ్చు. బయలుదేరే కేంద్రం విజయవాడగా చేసికొంటే వరుస క్రమం ఈ విధంగా చేసికొనవచ్చు.
విజయవాడ నుంచి హంపి, కావాలనుకుంటే మధ్యలో అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం,) గోవా, గోకర్ణం, జోగ్ జలపాతం, మురుదేశ్వర్, కొల్లూరు, శృంగేరి, ఉడిపి, ధర్మస్థల, హొరనాడు, సుబ్రహ్మణ్య, బేలూరు, హళేబీడు, శ్రావణ బెళగోళ, మైసూరు, బెంగుళూరు, లేపాక్షి ఈ పై కార్యక్రమాన్ని రెండు ముక్కలుగా కూడా చేసికొనవచ్చు.
1. South India లో హంపి తర్వాత గోవా వెళ్లి అక్కడి నుంచి గోకర్ణం, మురుదేశ్వర్, జోగ్ జలపాతం చూచుకుని వెనుకకు హుబ్లి మీదుగా విజయవాడ చేరుకొనవచ్చు.
2. విజయవాడ నుంచి సరాసరి మంగుళూరు చేరుకుని అక్కడి నుంచి ఉడిపి, కొల్లూరు, శృంగేరి, ధర్మస్థళ, సుబ్రహ్మణ్య, బేలూరు, హళేబీడు, శ్రావణ బెళగోళ, మైసూరు చూచుకొని, బెంగుళూరు మీదుగా వెనక్కు వచ్చేయవచ్చు.
ఒక ముఖ్యవిషయం కర్ణాటకలోని చాల ప్రదేశాలకు రైలు మార్గం లేదు. బస్సులో ప్రయాణం చేయవలసిందే. ఉడిపి, గోకర్ణంలకు కొంకణ రైల్వే వారి రైలు మార్గం వుంది. కాని రైల్వే స్టేషనులు ‘ ఊరికి పది కిలో మీటర్ల దూరంలో వున్నాయి. రైలు సమయాలు ఆయా వూర్లకు సంబంధించిన రైల్వే టైంటేబిల్ చూచుకుని మరీ మన యాత్రా కార్యక్రమం నిర్ణయించుకోవాలి.
ఇక South India లో కేరళ, తమిళనాడు యాత్ర పెద్ద ఇబ్బందికరంగా వుండదు. విజయవాడ నుంచి బయలుదేరి గురువాయూరు (త్రిచూరు) తిరువనంతపురం, కన్యాకుమారి, తిరుచందూరు, రామేశ్వరం, మదురై, కొడైకెనాల్, పళని, శ్రీరంగం, తంజావూరు, కుంభకోణం, వైదీశ్వరన్ కోయిల్, చిదంబరం, తిరువణ్ణామలై, కంచి, తిరుత్తణి, మహాబలిపురం, చూచుకుని, తిరుపతి మీదుగాగాని, మద్రాసు మీ దుగాగాని తిరిగి విజయవాడ చేరుకొనవచ్చు.
పైన చూపించిన వరుసను మద్రాసు, మహాబలిపురం వైపునుంచి మొదలు పెట్టి, గురువాయూరుతో ముగించుకొని రావచ్చు. కాని రైల్వే రిజర్వేషను ఇబ్బంది అయ్యే అవకాశం వుంది. అంతేగాక మన యాత్రలో ఏదైనా ఇబ్బంది వచ్చి మద్రాసుకు ఒకటి రెండు రోజులు అటూ ఇటూగా చేరుకున్న ఫరవాలేదు. మద్రాసు నుంచి విజయవాడకు అనేక రైళ్లు వున్నాయి.
ఇక ఊటి (ఉదకమండలం) కోయంబత్తూరు నుంచి మూడు గంటల బస్సు ప్రయాణం. మైసూరు నుంచి నాలుగు గంటల బస్సు ప్రయాణం. కనుక ఎవరి అనుకూలాన్ని బట్టి వారు, కర్ణాటక యాత్రలో భాగంగా గాని, తమిళనాడు యాత్రలో భాగంగా గాని వెళ్లి చూచిరావచ్చు.
South India Tour Special Things
South India యాత్ర చేయదలుచుకున్నవారు బయలుదేరటానికి ముందే, కొన్ని కొన్ని విషయాలను తెలిసికొనివుంటే, మనం చూడ బోయే ఒక్కొక్క ప్రదేశంలోను వుండుకున్న ప్రత్యేకతలు, ఆసక్తి కలిగించే అంశాలను మరింత శ్రద్ధగా చూడగలం. దానివల్ల మనకు మరింత తృప్తి, ఆనందం కలగడం సహజం. ఎందుకంటే యాత్రకంటూ బయలుదేరిన వారిలో నూటికి తొంభయి తొమ్మిది మంది దేవాలయాలు, పుణ్యస్థలాలు దర్శించేవారేగదా!
దేవాలయాలు అనగానే మత సంబంధమయినవే గదా ! కనుక మత సంబంధమైన కొన్ని అంశాలు, కొంతమంది ప్రసిద్ధ పురుషులను గూర్చి తెలిసికొని వుంటే, ఒక్కొక్క ప్రదేశం గూర్చి, అక్కడ వున్న దేవాలయాల వెనుక చరిత్ర మరింతగా బోధ పడుతుంది.
దాదాపు భారతీయులందరూ సనాతన సాంప్రదాయం ప్రకారం చెప్పబడుతూ వస్తూవున్న అన్ని రకాల దేవతలను పూజిస్తూ వుంటారు. పండుగలు, పర్వదినాలు మొదలైన రోజులలో, ఆరోజు ఏ దేవునికి సంబంధించిన ప్రాముఖ్యం కలిగినదైతే, ఆ దేవుని పూజిస్తారు. అనగా విష్ణువు, శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, లక్ష్మి, దుర్గ మొదలైన వారందరిని ఏ మాత్రమూ బేధభావం లేకుండా పూజిస్తారు. ఇలాటి సంప్రదాయం పాటించేవారిని ‘స్మార్తులు’ అంటారు. భారతీయులలో నూటికి తొంభైయ్యయిదు మంది స్మార్త సాంప్రదాయం పాటిస్తూ వున్నవారే !
కాని విష్ణువు మాత్రమే ఉత్కృష్టమైన దేవుడని, మిగిలిన దేవుళ్లు, దేవతలు అందరూ విష్ణువు చెప్పినట్లు నడుచుకొనేవారే నని చెబుతూ కేవలం విష్ణువుని మాత్రమే పూజించేవారు కొందరున్నారు. వీరిని ‘వైష్ణవులు’ అనిగాని, ‘శ్రీ వైష్ణవులు’ అని గాని అంటారు. తండూర్ దించి టారు. కె. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోను, కేరళలోను నూటికి తొంభయి తొమ్మిది మంది స్మార్తులు. కేవలం ‘శైవము’ పాటించేవారుగాని, లేదా కేవలం ‘వైష్ణవులు’ అనబడేవారుగాని నూటికి ఒకరు వుంటారు.
అండ తమిళనాడులో ఒక్క బ్రాహ్మణకులంలో మినహా మిగిలిన అందరూ స్మార్తులే. బ్రాహ్మణులలో మాత్రం అయ్యర్లు, అయ్యంగార్ అనే రెండు శాఖలు వున్నాయి. అయ్యంగార్లు లేక ఆచార్యులు అనబడేవారు కేవలం వైష్ణవ సంప్రదాయం పాటిస్తారు. కాని అయ్యర్లు అనబడేవారు మిగతా అన్నికులాల వారి లాగానే “స్మార్తులు” అయినప్పటికి, శైవ సంప్రదాయపు పద్ధతులను పాటిస్తారు అని చాలమంది అనుకుంటారు. ఎందుకనంటే తమిళనాడులో శ్రీరంగం లాటి ఒకటి రెండు చోట్ల వున్న దేవాలయాలు మినహా మిగిలిన ప్రసిద్ధ దేవాలయాలన్నీ శివసంబంధమైనవే.
మరొక ముఖ్య విషయమేమంటే, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో తప్పించి, మిగిలిన భారతదేశ మంతటా మగవారు మాత్రమే నుదుట విభూది ధరిస్తారు. స్త్రీలలో పుణ్యస్త్రీలు (భర్త వున్న స్త్రీలు) విభూది నుదుట ధరించరు. కాని తమిళనాడులోను, కేరళలోను వైష్ణవ సంప్రదాయం పాటించేవారు తప్ప మిగిలిన అందరూ, అంటే, స్త్రీలు, పురుషులుకూడ నుదుట విభూది ధరిస్తారు. ప్రతి దేవాలయం దగ్గరా మనం కొనే పూజ సామానులలో ఒక విభూది పొట్లం కూడా వుంటుంది. తమిళనాడులోని వైష్ణవులు రామానుజ సాంప్రదాయులు. వారు నుదుట తిరునామం (అంటే తెలుగువారు పంగనామాలు అంటారు.) రెండు నిలువు తెల్ల పట్టీలు, మధ్యన ఒక ఎర్రని కుంకుమ పట్టి ధరిస్తారు.
కర్ణాటకలోని బ్రాహ్మణులలో ఎక్కువ భాగం స్మార్తులు. మిగిలిన వారు వైష్ణవులు. అయితే ఈ కర్ణాటక వైష్ణవులు మధ్వ సాంప్రదాయులు. వీరు నుదుట నల్లని (చాదు) గీత పొడుగుగా ధరించి క్రింద భృగుటి మధ్య గంధపుచుక్క పెట్టుకొంటారు. మిగిలిన అన్ని కులాల వారు స్మార్తులు.అయితే కర్ణాటకలో లింగాయతులు అని ఒక కులం వుంది. వీరు వీరశైవ మతస్థులు. ఈ వీరశైవ మతం బసవేశ్వరునిచే స్థాపించబడ్డది.
ఈ వీరశైవ సాంప్రదాయాలు నుదుట అడ్డంగా విభూది రేకలు ధరిస్తారు. మెడలో యజ్ఞోప వీతం (జంధ్యం) లాగ ఒక తాడు కట్టుకొని దానికి ఒక శివలింగం చిన్న పెట్టెలాటి భరిణిలో పెట్టుకుని ధరిస్తారు.కర్ణాటకలోని ఉడిపి, ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయము మధ్య వైష్ణవులకు పవిత్ర స్థలాలు. తమిళనాడులోని శ్రీరంగం, కంచీపురం రామానుజ మతస్థుల నిలయాలు. కేరళలోని తిరువనంతపురం, గురువాయూరు, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి అందరు వైష్ణవులకు పవిత్ర స్థలాలే. కర్నాటకలోని లింగాయతులకు ప్రత్యేకించి ఒక కేంద్రం అంటూ లేదు.
శివ సంబంధమయిన అన్ని దేవాలయాలు వారికి పవిత్ర క్షేత్రాలే. అయితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం లింగాయతులకు ఆరాధ్య క్షేత్రం. కాని, స్మార్తులకు అన్ని దేవాలయాలు, అందరూ దేవుళ్లు, దేవతలు కావలసినవారే.
తేజోమూర్తులు – మహనీయులు :క్రీస్తు శకానికి ముందే మన భారతదేశంలో ఆవిర్భవించిన బౌద్ధ, జైన మతాలు కొద్ది కాలంలోనే బాగా ప్రాచుర్యం పొంది దేశమంతటా పాకి పోయినాయి. దానితో సనాతన ధర్మమయిన వేద ధర్మం కొంత వరకూ బలహీన పడింది. కాని, రాను రాను, బౌద్ధ జైన మతాలలో చీలికలు ఏర్పడి, అనేక అసహజమయిన పద్ధతులు చోటు చేసికొనడంతో, అంత వరకూ ఆ మతాల పట్ల వున్న ప్రజాదరణ సన్నగిల్ల బడటం ప్రారంభమైంది.
అంతేగాక వేద ధర్మం పాటించేవారిలోను అనేక వామాచార పద్ధతులు చోటు చేసికొని, వివిధ రకాల బేధాభిప్రాయాలకు, ఘర్షణలకు దారి తీయడం మొదలయింది. సరిగా ఆకాలంలో మొదటగా శంకరాచార్యులు, తరువాత వరుసగా రామానుజాచార్యులు, మధ్వాచార్య, వల్లభాచార్య, నింభార్కుడు అనే అయిదుగురు జన్మించి సనాతన వేద ధర్మం యొక్క సూత్రాలను ప్రజలకు బోధించి, మన దేశంలో తిరిగి సనాతన హైందవ ధర్మాన్ని పునరుజ్జీవితం చేశారు.
వీరందరూ భారతదేశమంతటా పర్యటించి సనాతన వేదధర్మం తిరిగి చిగురించి వికసించటానికి ఎంతో కృషిచేశారు.ఇందులో శంకరాచార్యులు కేరళలో జన్మించాడు. రామానుజాచార్యులు తమిళ దేశస్థుడు. మధ్వాచార్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవాడు. నింబార్కుడు, వల్లభాచార్యులు ఆంధ్రదేశంలో పుట్టిన అచ్చపు తెలుగువారు.
కాని ఆశ్చర్యంగా, బేధా బేధ వాదమనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన నింబార్కుని అనుయాయులు ఉత్తరప్రదేశ్, హర్యానాలలో ఇప్పటికీ ఎక్కువగా వున్నారు. 5. శుద్ధాద్వైతమనే పద్ధతిని ప్రచారం చేసిన వల్లభాచార్యులు చెప్పిన సూత్రాలను పాటించేవారు గుజరాత్, / రాజస్థాన్లలో ఎక్కువగా వున్నారు. అందువల్ల నింబార్కుడు, వల్లభాచార్యులను గూర్చి దక్షిణాదివారికి ముఖ్యంగా తెలుగువారికి దాదాపుగా తెలియదు అనే చెప్పాలి.