నా South India ప్రాంత ప్రదేశాలకు సంబంధించిన – మొదటి Traveling వ్యాసాలు పబ్లిష్ అయ్యాయి. నా వ్యాసాలను ఆదరించిన మీ సహృదయాదరణ, అభిమానమున్నూ. అందుకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలన్నా మాటలు లేవు. భాష చాలదు. అందుకే అందరికి కైమోడ్చి నమస్కరిస్తున్నాను.
ఈ వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టినపుడుగాని, ప్రచురించేటపుడుగాని, దానిని గురించి నాలో ఏ రకమైన అభిప్రాయం లేదు. అటూ, ఇటూ వెళ్లి వివిధ ప్రదేశాలు Traveling చేసి వద్దామా అనే వ్యసనం లేక పిచ్చి నా వరకూ నాకు అంటుకుపోయింది. ప్రతి మనిషికీ ఏదో ఒక పిచ్చి, ఎంతో కొంత వుంటుందని వేదాంతుల చెప్పినా ఊళ్లు తిరిగిరావడమనే పిచ్చి ఎందరికి వుంటుందో నిక్కచ్చిగా చెప్పలేము గదా!

ఇలాంటి వ్యాసం బహుశా internet లోమొదటిది కావచ్చు . – ఇది మొదట దక్షిణ భారత ప్రాంతములకు సంబంధించినది. ప్రచురించిన తరువాత, ఉత్తర భారత ప్రాంతములకు సంబంధించిన భాగము , హిమాలయ ప్రాంత ప్రదేశాలకు సంబంధించిన మూడవభాగము వెంటనే వ్రాసి పబ్లిష్ చేయగలను .
దీనినిబట్టి, తెలుగువారిలో Traveling చేయడంపట్ల ఆసక్తి వున్నవారు, ఊహించినదానికన్నా, చాలా ఎక్కువ సంఖ్యలో వున్నారని ఋజువయిపోయింది.
మొదటి పుస్తకం ప్రచురించిన నాటినుంచి ఎవరో ఒకరు, కనీసం వారానికి ఒక్కరైనా ఉత్తరంద్వారానో, ఫోనుద్వారానో తమ అభిప్రాయాలను, అభినందనలను తెలియజేస్తూనే వున్నారు. ఈ పుస్తకాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం నచ్చింది. కాని, ప్రతి ఒక్కరూ విడవకుండా ఒక ఏకాభిప్రాయం వెలిబుచ్చారు – ‘ వెంటవుండి చేయి పుచ్చుకుని నడిపించి తీసుకువెళ్ళినట్లే వుంది’ – అని. నా జన్మకు ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి.
దక్షిణ భారతదేశానికి సంబంధించిన పుస్తకంలో ఆ ప్రాంతంలో వున్న ప్రసిద్ధ ప్రదేశాలలో చాలావాటిని గురించి వ్రాశాను. అయినప్పటికీ, చెప్పుకోదగిన ప్రాముఖ్యతగల మరికొన్ని ప్రదేశాలు వుండిపోయాయి. కారణం మీకు తెలిసినదే. అప్పటికి ఆ ప్రదేశాలు నేను Traveling చేసి రాలేకపోయాను. స్వయంగా చూచిరాని ఏ ప్రదేశాన్ని గురించైనా వ్రాయడం నా నియమానికి విరుద్ధం.
తిరిగే కాలు… అని అన్నట్లు, పుస్తకం వ్రాయడం అయిపోయినా, దిట్టంగా పేరుకుపోయిన వ్యసనం ఊరికే వుండనీయదు గదా! ఆ కారణంగా, నేను ఇంతకుముందు చూడని ప్రదేశాలు, ఈ మధ్యకాలంలో చూచివచ్చాను. అవి Traveling చేసి వచ్చిన వెంటనే ఆ ప్రదేశం గూర్చి వ్రాసేయడం అలవాటయిన పని. అందువలన, అలా వ్రాసిన వాటిని ఏమిచెయ్యాలి అనే ఆలోచనకు అవకాశమే లేదు. కాని, వాటినిగూడ చేర్చి, దక్షిణ భారతదేశ ప్రాంతములకు సంబంధించిన పుస్తకం మరొక మారు ముద్రించి ప్రచురించవచ్చు అని తెలియజెప్పినవారు మీరే. మీ అభిమానానికి అనుగుణంగా ఇదిగో, ఈ మలి సంగ్రహం.
ఇప్పుడు వ్రాసి చేర్చిన వాటితో కలిపి, దక్షిణ భారతదేశంలో వున్న చూడదగ్గ ప్రదేశాలలో, కేవలం ఒకటో, రెండో తప్ప, దాదాపు అన్నిటిని గురించి వ్రాశాను అనుకుంటున్నాను. ఒకవేళ, నా ఊహకు అందని, నాకు తెలియని మరేవైనా ప్రదేశాలు వున్నాయని, సహృదయులైన మీరు తెలియజేస్తే, వాటిని తర్వాత చేర్చగలనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
CONCEPT OF TRAVELING
Traveling చేయడం అంటే కేవలం ఏదో కొన్ని వూళ్ళు తిరిగి రావడమే అని కొందరి అభిప్రాయం. యాత్రలు అంటే గుళ్లూ, గోపురాలు వుండే వూళ్లు దర్శించుకొని రావడమే అని చాలమంది నమ్మకం. కాని తీర్ధయాత్రయినా, విహారయాత్రయినా, అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మనం చూసే వూళ్లలో మనం తెలిసికోవలసిన అంశాలు ఏమిటి, అలాచూడడంలో మనం ఎలా ఆనందం పొందగలం, అనే విషయాల గూర్చి మనలో చాలామందికి, ముఖ్యంగా మన భారతీయులకు సరియైన అవగాహన లేదని నా సవినయాభిప్రాయం. గట్టిగా అడిగితే, “ఏదో నాలుగు రోజులపాటు అటూ ఇటూ తిరిగి రావడమే” అంటారు చాలమంది.
కాని, మనం మనవూరు, మన ప్రాంతము వదిలి మరొక ప్రాంతంలో కొన్నాళ్లు Traveling చేసి వస్తే, అక్కడ వుండే వారి జీవన పద్ధతులు, భోజన పదార్థాలు, వేష భాషలు, వారి ప్రవృత్తులు మనకు తెలిసి వస్తాయి. అవన్నీ మనకు కొత్తగాను, ఆశ్చర్యకరంగాను వుండవచ్చు. కాని మనం మనకు ఇంతవరకూ తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలిసికొనగలుగుతాము. మన చుట్టూవున్న ప్రపంచంలో ఎన్ని ఆనందకరమైన వింతలు, విశేషాలు వున్నాయో, ఎన్ని విచిత్రమైన అంశాలు మన అవగాహనను, జ్ఞానాన్ని మరింత విస్తరింపచేస్తాయో అర్థమవుతుంది.
దానాదీనా, మన ఆలోచనా విధానము, ఎదుటి మనుషులను గూర్చి, ముఖ్యంగా మనకు ఏమాత్రం పరిచయంలేని కొత్త వారిని గూర్చి మనం తలపోసే పద్ధతి, కొత్త విషయాలను మనం అర్ధం చేసికోవలసిన తీరు, వీటన్నిటిలోను ఎంతోకొంత మార్పు కలిగి తీరుతుంది. ఈ మార్పు, మన జ్ఞానాన్ని మరింత మెరుగుపరచడమే కాక, మన ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని కొత్త వెలుగుల బాటలోనికి నడిపిస్తాయి.
ఇక మనం చూచే కొత్త ప్రదేశాలలో, అంటే విహార యాత్రయినా, తీర్థ యాత్రయినా, ఆ ప్రదేశంలో వుండే ప్రకృతి శోభ, సౌందర్యం మొదలైన అంశాలు, ఉత్తమ విలువలుగల వాటిని చూచి ఆనందించి, ఆస్వాదించగల అభిలాషను పెంపొందింపచేస్తాయి. ఒకవేళ మనం చూచేది కేవలం పుణ్యక్షేత్రాలు మాత్రమే అయినా, అక్కడ వున్న గుడి లేక మందిరం యొక్క నిర్మాణంలో వున్న ప్రత్యేకత, శిల్ప సౌందర్యం, అన్నిటికి మించి ఆ గుడి లేక కట్టడానికి వెనుక వున్న పౌరాణిక, చారిత్రక విశేషాలు మొదలయినవి మన అవగాహనను, విజ్ఞానాన్ని ఎంతో మెరుగుపరుచుకుంటానికి దోహదమవుతాయి.
తీర్థయాత్రలకు వెళ్ళే చాలా మంది చేసే సాధారణమయిన పని ఏమిటంటే, ఏదో వాళ్ళూ వీళ్ళూ పదే పదే గొప్పగా చెప్పుకునే కొన్ని చోట్లకు మాత్రం వెళ్తూవుండటమూ, అక్కడ మొక్కుబడి చెల్లించుకున్నట్లుగా, ఆ గుళ్లోకి చొరబడి ఒక దండం పెట్టి రావడం మినహా, ఆ గుడికి సంబంధించిన ప్రత్యేకతలను గూర్చి తెలిసికొనడానికి ప్రయత్నించేవారు, ఆయా కట్టడాలలో వున్న శిల్ప సౌందర్యం, నిర్మాణ కౌశలం పరిశీలనగా చూసి అర్ధం చేసి కొన్న వాళ్లు చాల అరుదు అనే చెప్పాలి.
దీనికి కారణం ఏమిటంటే, చాల మందిలో ఈ రకమయిన విషయాల పట్ల అభిరుచి, ఆసక్తి లేక పోవడమే. మనం చదువుకునే చదువులలోగూడ, మన దేశ సంస్కృతి, నాగరికతలను గురించి తగినంత ఆసక్తి కలిగించే విధానం లేక పోవడం మొదటి కారణం. కాగా మన దేశంలో అనేక ప్రదేశాలలోని చూడదగ్గ ప్రదేశాలను గూర్చి వివరంగా తెలియజేస్తూ, మనలో ఆసక్తి కలిగించే విధంగా తెలియజెప్పే పుస్తకాలుగాని, వున్న, కనీసం పత్రికలుగాని లేనే లేవు అని చెప్పవచ్చు.
విదేశాలలో ఎవరైనా, ఒక క్రొత్త ప్రదేశాన్ని చూడటానికి వెళ్లేముందు, ఆ ప్రదేశం యొక్క సమగ్ర వివరాలు, ఆ ప్రదేశంలో చూడవలసిన అంశాలు, ఆ అంశాలలోని ప్రత్యేక విశేషాలు మొదలయిన వన్నీ, ముందుగానే సేకరించుకుని, వెంటదీసుకుని వెళ్తారు. అందువల్ల ఆ ప్రదేశంలో చూడవలసిన ముఖ్యమైన అంశాలనన్నిటినీ, ఒక్కటిగూడ మిగలకుండా చూడగలగటమేగాక, వాటిని చూచేటప్పుడు, నానిలోని విశేషాలను తమ దగ్గర వున్న వివరాల ఆధారంగా అర్థం చేసికొంటూ ఆనందించగలుగుతారు.
మొన్న మొన్నటి వరకూ, మన దేశంలో, దూర ప్రాంతాలకు వెళ్లటం మాట అటువుంచి, మన ప్రాంతంలోనే అటూ యిటూ వున్న చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళివచ్చే వారే అరుదు. కాని ఈ మధ్య ధన వంతులయినవారేగాక, మధ్యతరగతి వారు గూడ ప్రతి సంవత్సరంగాక పోయినా, రెండు మూడేళ్ల కొకసారయినా ఎక్కడో ఒక చోటకు వెళ్లిరావడం సాధారణమయింది. ముఖ్యంగా ప్రయివేటు కంపెనీల వారేగాక, చాలామంది ప్రభుత్వోద్యోగులకు కూడా శలవుకాల యాత్రా సౌకర్యం (Leave Travel Concession) కలిగించబడటంతో, చిన్న రకం ఉద్యోగులు కూడా సంసార సమేతంగా వూర్లు తిరిగి రావడం జరుగుతూవుంది.

ఇవన్నీగాక, యాత్రాసర్వీసులు అంటూ బస్సులలోనూ, రైళ్లలోనూ తీసుకువెళ్లే travel agencies గూడా బాగానే అభివృద్ధి చెందడంతో, చిన్న రకం వ్యాపారం చేసికొనేవారు, పల్లెటూళ్లలో వుండేవారు, ముసలివారు సహితం యాత్రలుచేసి వస్తూ వుండటం సాధారణమైపోయింది. అయితే, ఈ travel సర్వీసులవారు, తీసుకు వెళ్ళిన యావన్మందిని, గొర్రెల మందలాగా గుడిలోకి నెట్టటం, అయిదునిముషాలలో బయటపడేటట్లు చూడటం, తరువాత ఏదో ఒక చోట కూలేసి, ఏదో ఒకటి ఇంత వండి పెట్టడం, వెంటనే తిరిగి బయలుదేరదీయడం జరుగుతుంది.
అందు వల్లనే ఈ travel సర్వీసులలో వెళ్లివచ్చినవారు, వారు చూచి వచ్చిన ప్రదేశాలలోని విశేషాలు చెప్పలేక పోగా, చాలా మంది వారు ఏయే వూళ్ళు వెళ్లి వచ్చారోగూడ చెప్పలేరు. అయితే, దీనికి యాత్రా సర్వీసుల వారిని తప్పు పట్టలేము. వారి దృష్టి ఎంతసేపూ వీలయినంత తక్కువ ఖర్చుతో, వీలయినంత తక్కువ సమయంలో వారు చెప్పిన ప్రదేశాలన్నీ చూపించి వెనక్కు తీసుకురావడమేగదా !
ఇక L.T.C. (leave Travel Concession ) మీదగాని, తమంత తాముగా స్వంత ఖర్చులతో వెళ్లేవారుగాని చాలమందే వుంటున్నారు ఈ మధ్య. అయితే వీరిలో చాల చాలమంది, వారూ వీరూ చెప్పిన దానిని బట్టి, తాముగా ఊహించుకొన్న దానిని బట్టీ, ఏవో నాలుగయిదు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు మాత్రం వెళ్లిరావడమూ, ఆ వెళ్లిన చోటగూడ ఖరీదయిన హోటళ్ళలో బస చెయ్యడమూ, అవసరం ఏ మాత్రం లేకపోయినా టాక్సీలకు బోలెడు డబ్బు ఖర్చు పెట్టడమూ జరుగుతుంది.
అన్నిటికన్నా మించి, చూడవలసిన అంశాల ప్రాముఖ్యత తెలియక, అంతగా ప్రాధాన్యం లేనివాటి దగ్గర ఎక్కువ సమయం వృధాచేయడమూ, నింపాదిగాను, వివరంగాను చూడవలసిన వాని దగ్గర సమయం చాలక, సరిగా చూడకుండానే వచ్చేయడమూ సర్వసాధారణమయిన విషయం. అయితే, అసలు చూడవలసిన విషయాలేవో వీరికి తెలియక పోవడం వల్ల, వారు ఏమేమి చూడలేక పోయారో కూడా వారికి తెలియదు. బోలెడంత డబ్బు ఖర్చుచేసికొని గూడ దక్షిణ భారతంలోని నాలుగయిదు ప్రదేశాలు మాత్రం చూచి వచ్చిన వారిని నేను ఎందరినో ఎరుగుదును. కాని అదే డబ్బుతో, నలుగురు వున్న కుటుంబంవారు దక్షిణ భారతంలోని ఇరవై పైగా ప్రదేశాలను చూచి రావచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు.
మరొక ముఖ్యమయిన విషయం ఏమిటంటే, మనలో చాల మంది, బయలు దేరేది యాత్రలకయినా, ఒకానొక ఊరు చేరగానే, మొట్టమొదటగా చేసే పని ఏమిటంటే, ఆడవారు బజారున పడి కనిపించినదల్లా కొనటం. దానితో తీసుకు వెళ్లిన డబ్బు మధ్య దారిలోనే అయిపోయి, సగం యాత్రలోనే తిరిగి వచ్చిన వారిని ఎంతో మందిని చూడవచ్చు.
ఈ అంశాలనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, నేను వ్రాయదలుచుకున్న పద్దతి ఏమిటంటే, ఒక్కొక్క ప్రాంతంలోనూ దర్శనీయ స్థలాలు ఏమేమి వున్నాయి. ఆయా వూళ్ళకు ఎలా చేరుకోవచ్చు.
రాబోయే మరిన్ని ఇలాంటి వ్యాసాలు చదవండి.