Tourist Tips -2025

మనం అనుకున్న సమయానికి Tourist places అన్నీ, అనుకున్న విధంగా చూచుకుంటూ, అనుకున్న ఖర్చు మించిపోకుండా, అనుకున్న సమయానికి తిరిగి మన ఊరు చేరుకొనవచ్చు. అదీ, తృప్తిగాను, హాయిగానున్నూ. అయితే Tourist బృందంలోని ప్రతివారు ఈ క్రింద నేను సూచించే సూత్రాలు విధిగా పాటించి తీరాలి. దీనికి సంబంధించి నా యొక్క అనుభవాలు కొన్ని మన వెబ్సైటు లోనే తెలిపియున్నాను. అసలు ట్రావెలింగ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో చదవండి.

Important Tourist Tips

1. Tourist బృందము ఎట్టి పరిస్థితులలోను ఆరు లేక ఏడుమందికి మించి వుండకూడదు. అంటే, ఒకటి లేక రెండు కుటుంబాలకు మించి వుండకూడదు. దీనివల్ల రైల్వే రిజర్వేషనుకు, హోటళ్లలోను, సత్రాలలోను వసతి సౌకర్యాలకు ఇబ్బంది వుండదు.

2. Tourist బృందంలో ఒకే కుటుంబం వారు గాక రెండు మూడు కుటుంబాల వారు ఉంటే అందరూ ఒకే రకమైన అభిరుచి కలిగిన వారు అయివుండాలి. చూడవలసిన ప్రదేశాలలో ఒకరు ఇటూ, మరొకరు అటూ లాగేవారుగా వుండకూడదు.

3. Tourist బృందంలో మనవెంట విలువకలిగిన వస్తువులు నగలు వుండకూడదు.

4. డబ్బు వీలయినంతవరకూ వంటి మీదనే వుంచుకోవాలి. సూటు కేసులలోను సంచులలోను ఎట్టి పరిస్థితులలోను పెట్టగూడదు. మొత్తం డబ్బు Tourist బృందంలో ఆడవారి దగ్గర వుంచటం శ్రేష్టం. వారి వంటి మీద భద్రంగా వుంటుంది. ఎప్పటి కప్పుడు, ఆ రోజు వరకు కావలసిన మొత్తాన్ని మాత్రమే ఇవతలకు తీసుకొని మగవారు తమ దగ్గర పెట్టుకోవాలి.

TRAVEL

5. వెంటవుండే సామాను వీలయినంత తక్కువగా వుండాలి. మన సామాను మనమే ఇబ్బంది లేకుండాను, శ్రమ అనిపించకుండాను మోసుకు వెళ్లగలిగేటట్లు వుండాలి. ప్రతిచోట, సామానులు మోసేందుకు కూలి మనుషులు దొరుకుతారని భరోసా వుండదు.

6. పట్టణాలలో తప్ప Tourist స్థలాలలో మన వేషాన్ని పట్టించుకునేవారు వుండరు. ముఖ్యంగా దక్షిణాదిన, ధోవతిగాని, ధోవతి మడిచి లుంగీ లాగ గానీ కట్టుకున్నవారిని ఆలయాలలో మరింత గౌరవంగా చూస్తారు. మరీ బాగా దక్షిణాన వున్న కొన్ని దేవాలయాలలో మగవారు కేవలం ధోవతిగాని, లుంగీ గాని కట్టుకుని వుంటేనే ఆలయంలోపలికి అనుమతిస్తారు. పైన చొక్కాగాని, కనీసం బనీను గూడ వుండగూడదు. అందువల్ల Tourist బృందంలో మగవారు ఒకటి రెండు ధోవతులు లేదా తెల్ల లుంగీలు వెంట తీసుకు వెళ్లటం మంచిది. లేదంటే, ఆయా ఆలయాల దగ్గర ధోవతులు అద్దెకు ఇస్తారు. 

7. పిల్లలు, ముఖ్యంగా పసి పిల్లలు Tourist బృందంలో వుండకుండా చూచుకొనడం మంచిది. యాత్రలో భోజనము కొంచెం అటూ యిటూ అయినా తట్టుకొని నిలబడగల వారుగా వుండాలి. పసి పిల్లలు వుంటే, వారికి వేళకు ఆహారము, నిద్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వుంటుంది. దీనివల్ల మరింత శ్రమ కలగడమూ, సమయం వృధాకావడము జరుగుతుంది.

8. Tourist బృందంలో భోజనమూ, నిద్రా విషయంలో ఖచ్చితమైన పట్టింపులు వుండ గూడదు. అలా అని శాఖాహారులు మాంసాహారం తినమని గాదు. మన ప్రాంతంలో దొరికే భోజనము, మనకిష్టమయిన పదార్ధాలతో దొరికే భోజనము కావాలని అనుకోకూడదు. ఎక్కడ ఏ రకమయిన భోజనం దొరికితే సర్దుకుపోవాలి. అదీగాక, ఒక్కొక్క ప్రాంతంలో అక్కడి వారి భోజన పద్ధతులు, వారు తయారుచేసే పద్ధతి, వారి రుచులు, మొదలైనవన్నీ మనం తెలుసుకుంటానికి అవకాశం గూడ వుంటుంది.

9. యాత్రలో వంట వ్యవహారం పెట్టుకోకూడదు. వెళ్లిన ప్రతివూరిలోను చూడవలసిన వాటిని గురించి గాక, వంటకు కావలసిన సామానులు వెదుక్కుంటానికి, వండుకోవడానికి, తిరిగి అన్నీ శుభ్రంచేసికోవడానికి బోలెడు సమయం వృధా అవుతుంది. పైగా మన ఓపికంతా ఈ వంట వ్యవహారానికే హరించుకు పోతుంది.

10. ఇది ముఖ్య విషయం. మనం, ముఖ్యంగా, ఆడవారు, వెళ్లిన, ప్రతి చోట కనిపించిన దల్లా కొనగూడదు. రోజు రోజు మన సామాను బరువు పెరిగి పోవడం, యాత్ర చేసినన్ని రోజులు ఆ బరువు మోసుకుంటూ తిరగవలసి రావడం జరగుతుంది. అందువల్ల మన ఊరిలో దొరకనివి, మోసుకుంటూ తిరగటానికి ఇబ్బందిలేని చిన్న చిన్న వస్తువులు కొనాలి. అయినా ప్రపంచంలో ఎక్కడ తయారు అయిన వస్తువు అయినా మన ఊరిలోనూ దొరుకుతున్నాయి గదా ! కంచి పట్టుచీరెలు “కంచి ధరలకే” మన వూళ్లోనూ దొరుకుతున్న రోజులివి.

11. మనం యాత్రకు బయలు దేరాలనుకుంటే, మన అనుకూలాన్ని బట్టి ఏయే ప్రదేశాలు చూడాలో ముందుగానే ఒక పట్టిక తయారు చేసికోవాలి. దానికి ఎన్ని రోజులు పడుతుందో, మొత్తం ఖర్చు ఎంతవుతుందో ముందుగానే నిర్ధారించుకోవాలి. అలా ఖచ్చితంగా నిర్ధారించుకొనడానికి వీలుగా అవసరమైన అన్ని వివరాలు ఈ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. అందువల్ల, మొట్టమొదట ఈ పుస్తకం అసాంతము శ్రద్ధగా చదవాలి.

12. మనం వెళ్లదలుచుకున్న ప్రతివూరు రైలులో వెళ్లాలో, బస్సులో వెళ్లాలో, అక్కడ ఏ రోజున ఎన్ని గంటలకు చేరాలి, తిరిగి ఆ వూరు ఎప్పుడు వదలాలి, ఆ వూరిలో బస చేయవలసి వుంటుందా, అక్కరలేదా, అక్కడ ఏమేమి చూడాలి మొదలైన అతి చిన్న వివరాలు గూడ ఈ పుస్తకంలో నుంచి సేకరించుకుని ఒక చిన్న నోట్సులాగ వ్రాసి పెట్టుకొనాలి. ఎట్టి పరిస్థితులలోను ముందుగా నిర్ణయించుకొన్న ఈ కార్యక్రమం ప్రకారమే సాగి పోవాలి. 

13. మనం చూడ బోయే Tourist ప్రదేశాలలో ఎక్కడెక్కడ బస చెయ్యవలసిన అవసరం వుందో, వుంటే, అక్కడ సత్రము (Cottages) గాని రూములు గాని లేక హోటలు సౌకర్యాలు ఎలా వున్నయ్యో ఈ పుస్తకంలో వివరంగా తెలియజెయ్యడం జరిగింది. కొన్ని చోట్ల బసచెయ్యవలసిన అవసరం వుండదు. తమిళనాడు, కర్ణాటకలలో రైల్వే స్టేషనులలోనే గాకుండా, బస్సు స్టాండులలో గూడా కాల కృత్యాలకు, స్నానానికిగాను పరిశుభ్రమైన సౌకర్యాలు, అలాగే క్లోక్ రూములు కూడా వున్నాయి. అందువల్ల మనం బస చెయ్యనవసరం లేని ఊర్లలో రైల్వే స్టేషను లోని వెయిటింగు రూములలోగాని, బస్సు స్టాండులలోగాని కాల కృత్యాలు తీర్చుకొని, సామానులు క్లోక్ రూములో వుంచి, చేతులూపుకుంటూ చూడవలసినవి చూడటానికి వెళ్లవచ్చు.

14. మనం వెళ్లదలుచుకున్న ప్రదేశాలలో ఏ ప్రదేశానికైనా, అంటే యాత్రలో భాగంగా ఒక వూరి నుండి మరొక వూరికి వెళ్లేందుకు గూడా రైలులో వెళ్లవలసి వుంటే, ఆ ప్రయాణానికి రిజర్వేషను అవసరం అనుకుంటే, మన ఊరినుంచి మనం బయలుదేరే ముందే చేసి వుంచుకోవాలి. అక్కడికి వెళ్లిన తరువాత రిజర్వేషను దొరకకపోవచ్చు. దానికి ప్రయత్నించడానికి సమయమూ వృధా కాదు.

15. అలాగే మనం వెళ్లబోయే ఊళ్ళలో ఎక్కడెక్కడ రాత్రి పూట బస చెయ్యాల్సి వుంటుందో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆయా ఊళ్ళలో కాటేజీలు, సత్రములు వగైరా వుంటే, వాటికి ముందుగా రిజర్వేషను చేసికొనే ఏర్పాటు వుంటే ఆ వివరాలు కూడా ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. తగినంత డబ్బు వారికి ముందుగానే పంపి, ఆ ఏర్పాట్లు గూడా మనం బయలు దేరటానికి ముందే చేసికొని వుంచుకోవాలి. 

16. మనం చూసే కొన్ని ఊళ్ళలో సముద్రము, నది, పుష్కరిణి లాటి వాటిలో స్నానం చెయ్యవలసి వుంటుంది. అంటే, అలా చెయ్యడం మంచిది అనే విశ్వాసం కలవారి విషయంలో నన్నమాట. అందువల్ల సామానులు క్లోక్ రూములో పెట్టే ముందు, స్నానం చేసిన తరువాత మార్చుకుంటానికి ఒక జత బట్టలు ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ సంచి అయితే, స్నానం చేసిన తరువాత తడి బట్టలు పెట్టుకు రావడానికి అనువుగా వుంటుంది.

17. ఒక్కొక్క ఊరు చూడటం అయిపోగానే, వెంటనే, రైలు లేక బస్సులలో ఏది వీలయితే దానిలో, మనం చూడవలసిన తరువాతి ఊరుకు సాగి పోవాలి. అర్ధరాత్రయినా సరే, నిద్ర, విశ్రాంతి మొదలయినవి ఆ ముందు ఊరిలోనే చూచుకొనవచ్చు. ఒకవేళ ఈ ఊరిలోనే విశ్రాంతి తీసుకొని ఉదయమే లేచి వెళ్ళవచ్చునులే, అనుకుంటే ఉదయాన్నే మన కాలకృత్యాలు మనం అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చు. పరాయిచోట మన ఇంట్లో వున్నట్లు వుండదు గదా! అందువల్ల, అర్ధరాత్రయినా సరే, ఆ ముందు ఊరు చేరుకుంటే ఉదయాన కాలకృత్యాలు కొంచెం అటూ యిటూ అయినా కంగారుగాని, ఇబ్బందిగాని వుండదు. రైలుగాని, బస్సుగాని తప్పిపోతుందన్న భయం వుండదు.

18. ఒక్కొక్కప్పుడు అనివార్య కారణాల వల్ల, మనం ముందుగా నిర్ణయించుకున్న సమయంలో కొంచెం తేడా వచ్చి, మనం ముందు ఊరు వెళ్లవలసిన రైలు లేక బస్సుకు వెంటనే బయలుదేర వలసి వస్తే, భోజనం వగైరాల గూర్చి ఆలోచించకుండా, ఆ అనుకున్న బస్సుకు లేదా రైలుకు బయలుదేరి వెళ్లి పోవాలి. ఎందుకంటే మనం భోజనం వగైరాలు పూర్తిచేసికొని బయలు దేరాలనుకుంటే, ఆ సమయానికి మరొక బస్సు లేక రైలు వుండక పోవచ్చు. దానివల్ల మన కార్యక్రమం మొత్తం దెబ్బతినవచ్చు. 

19. ఆఖరుగా ఒక ముఖ్య విషయం : యాత్రలో ఎక్కడా, ఏ గుడిలోను ప్రత్యేక పూజలు వగైరా పెట్టుకొనకూడదు. కొన్ని కొన్ని దేవాలయాలలో, ఈ ప్రత్యేకమైన పూజలకు మనం ఊహించనంత ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల మన కార్యక్రమం దెబ్బతినే అవకాశం వుంది. అందువల్ల ఏదైనా ప్రత్యేక పూజ చేయించాలనుకున్నవారు, దానికి ఎంత సమయం పడుతుందో అక్కడి వారిని ముందుగానే విచారించి, దానికి మన సమయం అనుకూలిస్తేనే చేయించుకోవాలి. ఏయే ఊరిలో, ఏయే పూజలు జరుగుతాయో, దానికయ్యే ఖర్చు, సమయము మొదలైన వివరాలు, వీలయినంత వరకూ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అయినా, వీలయినంత వరకూ కేవలం దర్శనం చేసికొని రావడం మంచిది. కావాలనుకుంటే ఒక కొబ్బరికాయ కొట్టి సమర్పించుకుంటే చాలు.

20. యాత్రచేసే మొట్ట మొదటి రోజులలో డబ్బు వీలయినంత పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. చివరి రోజులలో ఇబ్బంది పడకూడదు.

         విశ్రాంతిగా, తాపీగా, హాయిగా, ఆనందంగా, ఏ ఇబ్బంది లేకుండా అనుకున్న ప్రదేశాలన్నీ తృప్తిగా దర్శించి, అనుకున్న తేదికి ఇంటికి తిరిగి రాగలగడమే మన ఏకైక లక్ష్యం అని గుర్తుంచుకొనడం అన్నిటికన్న ముఖ్యం. ఇక బయలు దేరుదాం పదండి.

We will be happy to hear your thoughts

Leave a reply

Categories

gsmarenamobiles.com
Logo
Register New Account
Compare items
  • Total (0)
Compare
0
Shopping cart